రష్యాకు చెందిన ఒకే డోసు కొవిడ్-19 టీకా, 'స్పుత్నిక్ లైట్'ను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సన్నద్ధమవుతోంది. దీనిపై మనదేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ అంశంపై భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ)తో సంప్రదింపులు సాగిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ (ఏపీఐ, సర్వీసెస్) దీపక్ సప్ర వెల్లడించారు.
"స్పుత్నిక్ లైట్‌కు ఇప్పటికే 15 దేశాల్లో అనుమతి లభించింది. దీనిపై రష్యాలో పెద్దఎత్తున క్లినికల్ పరీక్షలు జరిగాయి. ఆ సమాచారాన్ని డీసీజీఐకి అందజేశాం. మనదేశంలోనూ రెండు- మూడు నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం."
-దీపక్ సప్ర, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ
సెప్టెంబరు నుంచి లభ్యత పెంపు
రెండు డోసుల 'స్పుత్నిక్ వి' టీకా లభ్యత ఈ ఏడాది సెప్టెంబరు నుంచి బాగా పెరుగుతుందని దీపక్ సప్ర పేర్కొన్నారు. 'రష్యా నుంచి 10 కోట్ల డోసుల టీకా దిగుమతి కానుంది. దేశీయంగా ఈ టీకా ఉత్పత్తి మొదలవుతోంది. దీనివల్ల లభ్యత బాగా పెరుగుతుంది' అని వివరించారు.
"స్పుత్నిక్ వి టీకా డెల్టా వేరియంట్ మీద 83 శాతం ప్రభావశీలత కనబరచింది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకూ ఈ టీకా ఇచ్చే వీలుంది. దీనికి సంబంధించిన ప్రయోగాలు రష్యాలో జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలను మనదేశంలోనూ నిర్వహిస్తాం. పిల్లలకు కూడా టీకాను త్వరలో ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది"
-దీపక్ సప్ర, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ
రెండు రకాల టీకాలపై పరిశోధన
కొవిడ్-19 నుంచి అధిక రక్షణ కోసం బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని దీపక్ సప్ర వివరించారు. రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు ఇచ్చే విషయం కూడా పరిశీలించదగినదేనని తెలిపారు. ఈ విషయంలో టీకా ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. దీనిపై తాము కొన్ని ప్రయోగాలు నిర్వహించామని, త్వరలో ఫలితాలు వెలువడతాయని తెలిపారు. రెండు డోసుల్లో, రెండు రకాల టీకాలను 350 మందికి ఇచ్చి పరీక్షించామని, ప్రాథమికంగా సానుకూల ఫలితాలు కనిపించాయని అన్నారు.
ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర- ఎంతంటే?