మాతృభాషని పరిరక్షించుకుంటేనే మన భిన్నమైన సంస్కృతిని కాపాడుకోగలమని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. వివిధ భాషలు నేర్చుకోవడం వల్ల రకరకాల సంస్కృతులను అర్థం చేసుకోవచ్చని, ప్రపంచంలో శాంతి నెలకొనడానకి కృషి చేయొచ్చని తెలిపారు. కానీ మాతృభాషలో ప్రావీణ్యం సంపాదిస్తేనే అదంతా సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ మతృభాషా దినోత్సవం( ఫిబ్రవరి21) సందర్భంగా రాజ్యసభ సభ్యులకు వెంకయ్యనాయుడు లేఖ రాశారు.
ప్రతి ఎంపీ(రాజ్యసభ) తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతాలలో నేడు మాతృభాషకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. 'మాతృభాషను ప్రేమిద్దాం..మాతృభాషలో మాట్లాడదాం' అనే కార్యక్రమంలో భాగంగా మాతృభాష పరిరక్షణ కోసం పాటుపడాలని వెంకయ్య అన్నారు.
''చాలా భాషలు, వివిధ రకాల సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న మన దేశాన్ని చూసి గర్వపడాలి. మాతృభాషల్ని పరిరక్షించుకుంటే మన దేశ సంస్కృతిని కాపాడుకోగలం."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్
దాదాపు 200 భారతీయ భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిందన్నారు వెంకయ్య నాయుడు. ప్రతి రెండు వారాలకు ప్రపంచ వ్యాప్తంగా ఒక భాష కనుమరుగవుతున్నట్లు ఐరాస తెలిపిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఇక నాది అంగారకుడి టైమ్'