దేశంలో దళితులు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడక్కడ వారు నేటికీ దాడులకు గురవుతున్నారు. తాజాగా మంచి బట్టలు, కళ్లద్దాలు ధరించి ఉన్న ఓ దళిత యువకుడిని చూసి కొందరు ఉన్నత కులాల వారు జీర్ణించుకోలేకపోయారు. కోపంతో ఊగిపోయి ఆ యువకుడిపై దాడికి దిగారు. గుజరాత్ రాష్ట్రం పాలన్పుర్ ప్రాంతంలోని మోటా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. మోటా గ్రామానికి చెందిన జిగర్ షెఖాలియా మంగళవారం ఉదయం తన తల్లితో పాటు ఇంటి వద్ద ఉన్నాడు. అటుగా వెళ్తున్న కొందరు అగ్ర కులస్తులు జిగ్గర్ వద్దకు వెళ్లి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న జిగర్ తల్లిని కూడా చంపుతామంటూ బెదిరించారు. జిగర్ షెఖాలియా మంగళవారం రాత్రి ఊరు శివారులోని ఓ గుడి వద్ద ఉండగా.. అగ్ర కులానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అతడి దగ్గరకు చేరుకున్నారు. 'ఈ మధ్య కాలంలో నువ్వు నేలపై నిలవటం లేదు. నువ్వు ఫ్యాషన్ బట్టలు ధరిస్తావా?' అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. మధ్యలో అడ్డుకోబోయిన జిగర్ తల్లిని కూడా కర్రలతో కొట్టి ఆమె వస్త్రాలు చించేశారు. ఈ విషయం బయటికొస్తే చంపేస్తామని బెదిరించారు.
అట్రాసిటీ కేసు నమోదు..
ఫిర్యాదు అందుకున్న గఢ్ పోలీసులు ఏడుగురు అగ్రవర్ణ కులస్తులపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కులాన్ని దూశిస్తు దాడి చేసినందుకు గాను.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పటికీ నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సమాచారం.
మహిళపై ఆకతాయి గ్యాంగ్ దాడి..
గుజరాత్‌లోని దావోద్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. నలుగురు ఆకతాయిలతో కూడిన గ్యాంగ్.. ఓ మహిళపై దాడి చేసింది. ఏ మాత్రం కనికరం లేకుండా ఆమె దుస్తులు విప్పి మరీ విపరీతంగా గాయపరిచారు నిందితులు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఘటనపై పోలీసులు స్పందించారు. దాడి చేసిన వారిలో ఒకరిని ఆమె మాజీ భర్తగా గుర్తించి.. మిగతా ముగ్గురిని కూడా అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాదిత మహిళను దావోద్ జిల్లా రాంపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె గత ఏడాదిన్నరగా తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. దీంతో కలత చెందిన ఆమె భర్త ఈ దాడికి పాల్పడ్డాడు. మరో ఇద్దరి సహాయంతో ఆమెను కిడ్నాప్ చేసి అదే జిల్లాలోని మార్గలా గ్రామానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానిక పోలీసులు తెలిపారు.