Supreme court on matrimonial disputes: వివాహ సంబంధిత వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా కేసుల్లో.. భర్త కుటుంబ సభ్యుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేరుస్తూ వారిని పదేపదే నిందితులుగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ, పురుషుడిపై నమోదైన కేసును కొట్టివేసింది.
Sc on dowry death case: వరకట్న హత్య కేసులో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ రిషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో బాధితురాలి బావ, అత్తను లొంగిపోవాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది.
"ఎఫ్ఐఆర్లో చాలా మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. వారందరికీ నేరంలో ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లేవు. కాబట్టి.. వారికి వ్యతిరేకంగా విచారణ చేపట్టడం సమర్థనీయం కాదు. ఇలాంటి కేసులను పరిగణనలోకి తీసుకుంటే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అవుతుంది. "
-ధర్మాసనం
అసలేంటీ కేసు?
రూ.10 లక్షలు కట్నం, కారు కోసం తన కూతురిని ఆమె భర్త సహా బావ, వదిన, అత్త, ఆడపడచు వేధించారని 2018 జులై 25న గోరఖ్‌పుర్‌లోని పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. నిందితులంతా కలిసి జులై 24న తమ కుమార్తెకు ఉరి వేసి, హత్య చేశారని చెప్పారు. తన కుమార్తె చనిపోవడానికి పదిరోజుల ముందు ఆమెను చంపేస్తామని, బెదిరిస్తూ తీవ్రంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'నిర్దిష్టమైన ఆరోపణలు లేవు'
మృతురాలి తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తే.. నిందితులపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవని తెలుస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేగాకుండా పోలీసుల వద్ద నమోదైన అతని వాంగ్మూలాన్ని పరిశీలిస్తే.. వారంతా నేరానికి పాల్పడ్డారనేందుకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. తమ కూతురుని గాయపరిచారని బాధితురాలి తండ్రి ఆరోపించినప్పటికీ.. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి గాయాలు కనిపించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఊపిరాడకపోవడం వల్లే బాధితురాలు మరణించినట్లుగా ఉందని చెప్పింది. "వివాహ వివాదాల్లో.. భర్త తరఫు కుటుంబ సభ్యులను ఎఫ్ఐఆర్లో చేర్చుతూ పదేపదే వారిని నిందితులుగా పరిగణిస్తున్నారు" అని పేర్కొంటూ.. బాధితురాలి బావ, అత్తపై నమోదైన కేసును కొట్టివేసింది.
ఇదీ చూడండి: 'మందులు వాడకుండానే ఒమిక్రాన్ బాధితుల రికవరీ!'
ఇదీ చూడండి: ఆ పాఠశాలలో 'భోజనమాత' వివాదానికి తెర.. కుదిరిన సయోధ్య!