Kid Fell Into Borewell : మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది రెండున్నరేళ్ల చిన్నారి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బాలిక ఆడుకుంటుండగా బోరుబావిలో పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ప్రస్తుత పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సీహోర్ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మంగళవారం బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 ప్రొక్లేయినర్లు, జేసీబీ ఇతర యంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదట 30 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రస్తుతం 50 అడుగుల లోతులోకి జారినట్లు తెలుస్తోంది.
'బుధవారం ఉదయం నుంచి జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లోపల ఒక పెద్ద బండరాయి ఉంది. దానిని డ్రిల్లింగ్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.అయితే చిన్నారి ఇంకొంచెం కిందకు జారింది. ప్రస్తుతం చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించాము. చిన్నారికి పైప్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తున్నాము. రెస్య్కూ సిబ్బంది అధునాతన పద్ధతిలో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు'
- సీహోర్ జిల్లా కలెక్టర్.
సీఎం జిల్లాలో ఘటన..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేసి, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మూడు రోజుల కింద మరో ఘటన..
Borewell baby dies : గుజరాత్లో శనివారం ఉదయం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు 19 గంటల పాటు.. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనపై సమాచారం అందుకుని, వెంటనే రెస్కూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పాపను బయటకు తీశారు. అయితే.. చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లో జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడింది. 200 అడుగుల లోతున్న బోరుబావిలో చిన్నారి పడిపోయినట్లు సమాచారం. 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకుందని అధికారులు తెలిపారు. తమచన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఓ గిరిజన తెగకు చెందిన వారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.