డ్రైవర్ విధుల్లో ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే అది ప్రమాదం కిందే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈశాన్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (ఎన్ఈకేఆర్టీసీ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఈ విధంగా తీర్పు ఇచ్చింది.
డ్రైవర్ విజయ్‌కుమార్ కుటుంబానికి రూ.21.95 లక్షలు పరిహారం అందించాలని 2017లో సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఈకేఆర్టీసీ సవాల్ చేసింది.
ప్రమాదమే..
జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్, జస్టిస్ పీఎన్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం డ్రైవర్ విజయ్ కుమార్ మృతి గురించి ప్రస్తావించింది.
"2012 సెప్టెంబరు 5న విజయ్ కుమార్ ఉదయం 6 గంటలకే విధులకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు మృతిచెందారు. అప్పటివరకు నిర్విరామంగా 11 గంటల పాటు పనిచేశారు. 22 ఏళ్ల పాటు భారీ వాహనాలు నడపడం ఒత్తిడికి దారి తీస్తుంది. పిటిషనర్ పేర్కొన్న విధంగా ఆయన మరే ఇతర కారణాలతో చనిపోలేదు. వైద్య నివేదికలు కూడా డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందారనే స్పష్టం చేస్తున్నాయి."
-కర్ణాటక హైకోర్టు
బాధిత కుటుంబానికి ఎన్ఈకేఆర్టీసీ తక్షణమే పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చూడండి : దేశంలో ఆరుగురికి కొత్త రకం వైరస్