Fake Pilot for Girlfriends : పైలట్‌నంటూ నలుగురు అమ్మాయిలను నమ్మించాడు ఓ 20 ఏళ్ల యువకుడు. ఫేక్ పైలట్ అవతారం ఎత్తి నలుగురిని ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్తూ.. గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులకు చిక్కాడు. బోర్డింగ్ సిబ్బందికి పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో శనివారం జరిగింది.
20 Year Old Youth Poses As Pilot : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రక్షిత్ మంగేలా.. మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన వ్యక్తి. రక్షిత్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు.. వడోదర ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే అక్కడి బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిర్ ఇండియాలో పైలట్ అని చెప్పుకున్నాడు. అతడిపై అనుమానం వచ్చిన సిబ్బంది.. సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడొక ఫేక్ పైలట్‌గా తేలింది.
వెంటనే అతడిపై హర్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. రక్షిత్‌కు అహ్మదాబాద్, రాజ్‌కోట్, ముంబయితో పాటు నెదర్లాండ్స్‌లోనూ ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని పోలీసులు గుర్తించారు. కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకు రక్షిత్ ఇలా ఫేక్ పైలట్ అవతారం ఎత్తాడని వారు తేల్చారు. ఉగ్రవాద సంస్థలతో గానీ, ఇతర నిషేధిత సంస్థలతో అతడికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధరించుచుకుని.. అర్థరాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నిజమైన పైలట్ కాదని నిందితుడితోనే గర్ల్‌ఫ్రెండ్స్‌కు మెసేజ్
20 Year Old Fake Pilot Nabbed in Gujarat : అయితే, ఆ నలుగురు అమ్మాయిలకు తాను నిజమైన పైలట్ కాదని రక్షిత్తోనే మెసేజ్ చేయించారు పోలీసులు. నిందితుడు నిజంగానే పైలట్ కావాలని కలలు కన్నాడని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కోరిక నెరవేరలేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ ముంబయిలోని ఓ ప్రైవేటు సంస్థలో.. రక్షిత్ గ్రౌండ్ స్టాఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడని పేర్కొన్నారు.