COVID-19 Cases In Ahmednagar School: మహారాష్ట్రలోని నవోదయ పాఠశాలలో కరోనా బారిన పడినవారి సంఖ్య మరింత పెరిగింది. పాఠశాలలో మొత్తం 51 మంది విద్యార్థులు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. అహ్మద్‌నగర్ జిల్లా టక్లీ ధోకేశ్వర్‌లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మొదట 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు పాఠశాలలోని 450 మందికి కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మరో 32 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో స్కూల్ మొత్తంగా 51 మంది కొవిడ్ బారిన పడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిలో 48 మంది విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే పాఠశాలను సీల్ చేసి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
COVID-19 Cases In Maharastra:
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మళ్లీ కొవిడ్ విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. ఒమిక్రాన్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే.. నగరంలో 922 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసులతో(757) పోలిస్తే ఇవి 21 శాతం అధికం. దాదాపు ఏడు నెలల తర్వాత అత్యధిక కేసులు బయటపడటం గమనార్హం. జూన్ 4న ఇక్కడ 973 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదవడం గమనార్హం. ఇక్కడ 141 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి.
ఆదివారం ఒక్కరోజే కొత్తగా 31 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: Delhi Night curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ