Bus accident in Rajasthan : వంతెనపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి.. కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని దౌసాలో జైపుర్-దౌసా 21వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిందీ ప్రమాదం.
ప్రమాదానికి గురైన బస్సు.. 32 మందితో హరిద్వార్ నుంచి ఉదయ్‌పుర్ వెళ్తోంది. ఉదయం 2 గంటల 15 నిమిషాల సమయంలో దౌసాలోని కలెక్టరేట్ సర్కిల్ ప్రాంతంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌పై వెళ్తుండగా.. వాహనం అదుపు తప్పింది. వంతెన గోడను ఢీకొట్టి.. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి రైలు పట్టాలపై పడింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు కాసేపటికే మృతిచెందారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నందున.. మెరుగైన చికిత్స కోసం జైపుర్ తరలించారు.
బస్సు-బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సందీప్ శర్మ(32), సంతోష్ శర్మ(26) ఓ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కొత్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓవర్ బ్రిడ్జ్‌పై వారి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పెళ్లికి వెళ్తూ వరుడు దుర్మరణం
పంజాబ్ మోగా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా నలుగురు మరణించారు. ఫిరోజ్‌పుర్-లుధియానా రహదారిపై ఆదివారం జరిగిందీ ఘటన.
సుఖ్వీందర్ సింగ్(23) వివాహం ఆదివారం లుధియానా జిల్లా బడ్డోవల్ గ్రామంలో జరగాల్సి ఉంది. బంధువులతో కలిసి సుఖ్వీందర్ కారులో పెళ్లి మండపానికి వెళ్తుండగా.. వారి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుడితోపాటు అతడి బంధువులు ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.