రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు వేదికగా కీలక పరిణామాలు జరిగాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించిన సభాపతి ఎస్పీ జోషి.. తాను చేపట్టాల్సిన ప్రక్రియను హైకోర్టు అడ్డుకోజాలదని సర్వోన్నత న్యాయపాలికకు నివేదించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా సుప్రీంలో తన వాదనలు వినిపించారు.
ఈ వ్యవహారమై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 1992 నాటి కిహిటో హాలన్ కేసును ఉటంకిస్తూ అనర్హత వేటు వేయడంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని కపిల్ సిబల్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడం, అనర్హత వేటు వేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న అనంతరమే ఆయా అంశాలు కోర్టు పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
సచిన్ పైలట్ సహా 19మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై జులై 24 వరకు అనర్హత వేటు వేయకుండా స్టే విధించింది రాజస్థాన్ హైకోర్టు. ఈ నేపథ్యంలో స్పీకర్ జోషి సుప్రీంకోర్టుకు వెళ్లారు.