దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో పాటు వైరస్ నివారణ సంసిద్ధతను పీఎంఓ(ప్రధానమంత్రి కార్యాలయం) సమీక్షించింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ అంశంపై 2020 జనవరి 25 తరువాత పీఎంఓ మళ్లీ సమీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి.
కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని పీఎంఓ దిశానిర్దేశం చేసింది. ఈ వైరస్‌పై పోరాటంలో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రైవేటు రంగం కూడా కలిసివచ్చేలా చేయాలని చెప్పింది.
జీఐఎస్ డేటా సహకారంతో వ్యాధి వ్యాపించిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని పీఎంఓ నిర్ణయించింది.
చురుకుగా పనిచేస్తున్నాం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వ్యాప్తి నివారణ చర్యలను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఇప్పటి వరకు 21 విమానాశ్రయాల్లో 6 లక్షల మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా చురుగ్గా పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
విదేశాల్లోని భారతీయులకు కరోనా
విదేశాల్లోని 17 మంది భారతీయులకు ఈ వైరస్ సోకినట్లు విదేశాంగమంత్రిత్వశాఖ వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ స్పందిస్తూ.. జపాన్‌లోని క్రూయిజ్ షిప్‌లోని 16 మందికి, యూఏఈలోని ఒక భారతీయునికి కరోనా సోకినట్లు తెలిపారు.
పాఠశాలల మూసివేత
కరోనా వ్యాప్తిపై మానవ వనరుల మంత్రిత్వశాఖ.. పాఠశాలలను అప్రమత్తం చేసింది. విద్యార్థుల్లో వైరస్ పట్ల అవగాహన పెంచాలని దిశానిర్దేశం చేసింది. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కరోనా భయాలతో... ముందు జాగ్రత్తగా దిల్లీ-ఎన్సీఆర్లోని మూడు పాఠశాలలను మూసివేశారు. మరో రెండు పాఠశాలలైతే తమ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అప్పుడే వేసవి సెలవులు ప్రకటించాయి. కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
ఇటాలియన్ టూరిస్టులు
రాజస్థాన్‌లో పర్యటించిన ఇటాలియన్ (కొవిడ్-19 సోకిన) పర్యటకులతో సుమారు 215 మంది కలిసినట్లు రాజస్థాన్ ఆరోగ్యశాఖమంత్రి రఘుశర్మ శాసనసభకు తెలిపారు. ఇటలీ పర్యటకుడు, అతడి భార్యకు వైరస్ సోకడం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది.
నిర్బంధ పరీక్షలు
దక్షిణకొరియాకు వెళ్లివచ్చిన ఇద్దరు ప్రయాణికులను జమ్ముకశ్మీర్‌లోని ఓ వైద్య కళాశాలలో ఉంచి పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'అల్లర్లతో భరతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు'