కరోనా భయంతో రోజులో పలు మార్లు చేతులను శుభ్రం చేసుకోవటం, శానిటైజర్ వాడటం చేస్తున్నాం. కానీ, మనం నిత్యం వినియోగిస్తున్న ఎన్నో రకాల వస్తువులనూ శానిటైజ్ చేసుకోవాలి. కానీ క్రిమిసంహాకరకాలు వినియోగిస్తే ఎంతో ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జలంధర్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఎలాంటి క్రిమిసంహారకాలు అవసరం లేని యూవీ శానిటైజర్ పరికరాన్ని రూపొందించింది. టైమర్ అమర్చిన ఈ పరికరం యూవీ రేడియేషన్ ద్వారా వస్తువులపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపుతుందని వెల్లడించింది.
బాక్సు ఆకారంలో ఉండే ఇందులో పైన, కింది భాగాల్లో అల్ట్రా వయొలెట్ లైట్లను అమర్చారు. దీని ద్వారా ప్యాకింగ్ చేసిన ఆహారపదార్థాలు, కరెన్సీ నోట్లు సహా క్రెడిట్ కార్డులు, పేపర్లు, దస్త్రాలు, వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, తాళాలు వంటి వివిధ రకాల వస్తువులను శానిటైజ్ చేయవచ్చని తెలిపింది నిట్. బాక్సు డ్రాయర్లో వస్తువులను ఉంచినప్పుడు యూవీ రేడియేషన్ కిరణాలు వాటిపై ఉన్న సూక్ష్మజీవులను చంపుతాయని పేర్కొంది.
ఇందులో యూవీ-సీ రేడియేషన్ సాంకేతికతను వినియోగించారు. దీనిని ప్రధానంగా గాలి, నీరు, ఉపరితలంపై సూక్ష్మజీవులను చంపేందుకు వినియోగిస్తున్నారు. యూవీ లైట్స్ పూర్తి సురక్షితం, తక్కువ నిర్వహణ ఖర్చు, ఎలాంటి క్రిమిసంహారకాలు అవసరం లేనందున ప్రస్తుతం చాలా ఆహార పరిశ్రమల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.
నిట్ డైరెక్టర్ డా.ఎల్కే అశ్వతి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. కుల్దీప్ సింగ్ సంయుక్తంగా దీనిని రూపొందించారు. ఈ పరికరం పెద్దవారితో పాటు చిన్నారులకూ చాలా సురక్షితమని చెబుతున్నారు.
" మార్కెట్లో ఇలాంటి ఇతర యూవీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మా శానిటైజర్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీంతో మనుషులపై ఎలాంటి ప్రభావం పడదు. చాలా సురక్షితమైంది. డ్రాయర్ తెరిచినప్పుడు యూవీ లైట్స్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఇందులో ఆక్రిలిక్ షీట్లు, లైట్లు అమర్చటం వల్ల అన్ని కోణాల నుంచి వస్తువులపై యూవీ లైట్స్ పడి వైరస్‌ను అంతమొందిస్తుంది. ఇళ్లు, కార్యాలయాల్లోనే కాక బ్యాంకుల్లోనూ సురక్షితంగా వినియోగించవచ్చు. క్యాషియర్ నోట్లను పరికరంలోని డ్రాయర్లో పెట్టి 2 నిమిషాల సమయాన్ని సెట్‌చేస్తే.. సమయం పూర్తయిన తర్వాత అదే ఆఫ్ అవుతుంది. అదే విధంగా ప్యాకింగ్ చేసిన ఆహారపదార్థాలు, బాటిళ్లు వంటివి శానిటైజ్ చేయొచ్చు. టైమర్‌ను 5 నిమిషాల వరకు సెట్ చేయవచ్చు. ఇందులో బిగించిన ఫ్యాను ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది."
- డా.కుల్దీప్ సింగ్, నిట్ అసోసియేట్ ప్రొఫెసర్
ఈ పరికరాన్ని ఇప్పటికే పేటెంట్ హక్కుల కోసం పంపినట్లు చెప్పారు డా. అశ్వతి. వాణిజ్య ఉత్పత్తి కోసం ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: యూవీ శానిటైజర్‌తో నిమిషాల్లోనే క్రిములు ఖతం!