బంగాల్ సీఎం మమతా బెనర్జీపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. తన అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకే ఇన్నాళ్లూ బంగాల్లో రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు కాకుండా మమతా బెనర్జీ అడ్డుపడ్డారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దీదీకి ప్రజలు టాటా చెప్తారన్నారు. మాల్డాలో జరిగిన భారీ రోడ్‌షోలో నడ్డా పాల్గొన్నారు. అడుగడుగునా భాజపా కార్యకర్తలు పూలు జల్లి జై శ్రీరామ్ నినాదాలతో నడ్డాకు స్వాగతం పలికారు.
"ఇన్నాళ్లూ బంగాల్ రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే డబ్బులు రాకుండా మమత అడ్డుకున్నారు. వాళ్లను మోసం చేశారు. కేవలం తన ఈగోను సంతృప్తి పరుచుకునేందుకే దీదీ ఇలా చేశారు. ఇప్పుడు రైతులే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిసి మమత తెలివిగా అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల 70 లక్షల మంది రైతులు ఏటా రూ.6 వేలు కోల్పోయారు.
నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అయితే ఈ నినాదం వింటే దీదీకి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు."
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు నడ్డా. అనంతరం మాల్డాలో ఉన్న జాతీయ సబ్ట్రాపికల్ ఉద్యానవనాన్ని సందర్శించారు. అధికారుల ద్వారా సంస్థ చేసే పరిశోధనలను ఆయన తెలుసుకున్నారు. మోదీ సర్కార్ ఇలాంటి సంస్థల పురోగతికి అండగా ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: