రోడ్లపై, నదులపై కట్టిన వంతెనలు చూసుంటారు. అంతెందుకు సముద్రాలు దాటించే వంతెనల గురించి వినుంటారు. కానీ, పనస చెట్టెక్కించే వంతెన ఎక్కడైనా చూశారా? అవును, కేరళ కొల్లం జిల్లాలో పనస చెట్ల బ్రిడ్జ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొట్టరక్కరకు చెందిన ఓ ఇంజినీర్.. పండ్లు కోయాలంటే అందరిలా తానూ చెట్లెక్కడం ఏంటనుకున్నాడో ఏమో.. మేధస్సంతా ఉపయోగించి ఏకంగా పనస చెట్టుకు వంతెన నిర్మించేశాడు.
ఇంజినీర్ ప్రకృతి ప్రేమికుడైతే....
కొట్టరక్కరకు చెందిన జానీ చెక్కలా.. ప్రభుత్వ విభాగంలో ఇంజినీర్. జానీకి ప్రకృతంటే మహా ఇష్టం. అందుకే, తన ఇంటి పెరట్లో.. రకరకాల పూలు, పండ్ల చెట్ల, ఔషద మొక్కలతో ఎటు చూసినా హరితమయమే. వీటితో పాటు జానీ ఇష్టంగా పెంచుకుంటున్న కొన్ని తియ్యటి తెన్వరికా రకం పనస చెట్లూ ఉన్నాయి. వాటికి ఏటా వందలాది కాయలు కాస్తాయి.
అయితే, ఇంతకాలం ఇరుగుపొరుగు వారిని బతిమాలి చెట్టెక్కించి ఆ పండ్లను కోసేవాడు జానీ. కానీ, కొద్ది రోజులుగా వారెవరూ రావడం కుదరదంటున్నారు. దీంతో.. జానీలోని ఇంజినీర్ బయటికొచ్చాడు. స్నేహితుడు జొప్పన్తో కలిసి వంతెనకు ప్రణాళిక సిద్ధం చేశాడు.
కొద్ది రోజుల్లోనే దాదాపు 50 అడుగుల ఎత్తున్న ఈ పనస చెట్లపైకి సులభంగా నడుచుకుంటూ వెళ్లేలా.. ఇనుము, ఫైబర్‌తో వంతెన నిర్మించాడు. ప్రస్తుతం ఐదు చెట్లను కలుపుతూ ఉన్న ఈ పనస చెట్ల బ్రిడ్జ్‌ను.. కాస్త దూరంలో ఉన్న మరో చెట్టు వరకు విస్తరించే ఆలోచనలో ఉన్నాడు జానీ.