కరోనా వైరస్‌కు సంఘీభావం తెలుపుతూ.. జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాయడాన్ని చైనా అభినందించింది. వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో తమకు బాసటగా నిలవాలన్న మోదీ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంజ్ షువాంగ్ ప్రకటన విడుదల చేశారు. కరోనాను అరికట్టేందుకు భారత్‌తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
" కరోనాతో చేస్తున్న పోరాటంలో మాకు అండగా నిలిచినందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ చర్యలు మా ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రికి నిదర్శనం."
- గెంజ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
రాత్రికి చైనాకు డబ్ల్యూహెచ్ఓ...
కరోనా మహమ్మారి ధాటికి చైనాలో ఇప్పటిదాకా 908 మంది మృతి చెందగా.. 40 వేల మందికి పైగా జనాభా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనాతో పోరాడుతున్న చైనా అధికారులకు సాయమందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ రాత్రికి చైనాకు చేరుకోనుంది.
ఇదీ చదవండి: కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్ అధికారి