భారత దేశ దౌత్యపరమైన ఒత్తిడితో కాలాపానీపై నేపాల్ వెనక్కితగ్గింది. సరిహద్దు వెంట వ్యూహాత్మకంగా కీలకమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమ భూభాగానికి చెందినవిగా చెబుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది నేపాల్. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను ప్రస్తుతానికి వాయిదా వేసింది.
నేపాల్ కొత్త మ్యాప్‌పై ఆగ్రహించిన భారత్.. పొరుగు దేశానికి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరుదేశాల సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నడుమ దేశ మ్యాప్‌ను నవీకరించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన తరుణంలో.. ఈ అంశంపై జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం కోరాలన్న ప్రధాని కేపీ శర్మ ఓలీ నిర్ణయంతో పార్లమెంట్లో చర్చ వాయిదాపడింది.
ఇదీ చూడండి: 'కాలాపానీ'పై నేపాల్‌కు భారత్ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!
ఈ ఇరుగుపొరుగు దేశాల ఘర్షణల మధ్య సరిహద్దు వివాదంపై.. 'ఈటీవీ భారత్' క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. ఇందుకోసం 1955 నుంచి భారత్ దళాలు మోహరించి ఉన్న.. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాకు వెళ్లింది. కాళీ ఆలయం గర్భగడి నుంచే కాళీ నది ఉద్భవించిందని సాక్ష్యాలు చూపించింది.
ఏం చెప్పిందంటే..
లిపులేఖ్ రోడ్డు నిర్మించిన తర్వాత.. తొలిసారి 'ఈటీవీ భారత్' ప్రతినిధి చైనా సరిహద్దుకు వెళ్లి వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చైనా సరిహద్దు వరకు లిపులేఖ్ రహదారిని నిర్మించడానికి సరిహద్దు రహదారుల సంస్థకు(బీఆర్ఓ) 12 సంవత్సరాలు పట్టింది. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది 'ఈటీవీ భారత్'. ఈ క్లిష్ట రహదారిని నిర్మించే సమయంలో దాదాపు 12 మంది బీఆర్ఓ సిబ్బంది, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘాతియాబ్గఢ్ నుంచి లిపులేఖ్ వరకు.. రూ. 400 కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించింది బీఆర్ఓ.
ఎంతో కష్టంగా...
ఈ రహదారి కోసం రెండు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్న బీఆర్ఓకు ఇక్కడ చిక్కొచ్చిపడింది. ఘాతియాబ్గఢ్-మాల్పా మధ్యలో మొత్తం కొండ ప్రాంతమే. పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించిన తర్వాతే రహదారి నిర్మాణం సాధ్యమైంది. అందుకే.. కేవలం 8 కి.మీ. దూరానికే 11 సంవత్సరాలు పట్టిందట. మొత్తంగా 74 కి.మీ. రహదారి పూర్తయ్యేందుకు పన్నెండేళ్లు పట్టింది. మాల్పా, బుండీ వద్ద ఇంకా రెండు వంతెనల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. ఇక్కడ పగటిపూట హిమానీనదాలు కరిగి నీటిమట్టం పెరుగుతుండటం వల్ల వంతెనల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
గుంజీ-కాలాపానీ మధ్యే...
భారత్‌కు రక్షణ పరంగా చియాలేఖ్ కూడా అత్యంత ప్రాధాన్యమైనది. ఈ బుండీ నుంచి చియాలేఖ్కు వెళ్లాలంటే ఎంతో కష్టం. 12 చోట్ల ఎత్తువంపులతో మార్గం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అనుమతి లేకుండా ఇది దాటి వెళ్లేందుకు అవకాశం లేదు.
చియాలేఖ్ తర్వాత గర్బ్యాంగ్ను దాటితే.. భారత్‌కు మరో రక్షణ కేంద్రమైన గుంజీ గ్రామం ఉంటుంది. మొత్తం నదులతో చుట్టుముట్టి ఉన్న ఈ సున్నితమైన ప్రాంతంలో భారీ భద్రత ఉంటుంది. (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) ఐటీబీపీ ఏడో బెటాలియన్, సైన్యం, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)ని ఇక్కడ భారీగా మోహరించారు.
ఈ రోడ్డుతోనే జగడం...
ఉత్తరాఖండ్‌లోని ధార్చులాతో లిపులేఖ్ పాస్‌ను కలిపే వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారిని మే 8న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన తర్వాత చైనా, నేపాల్ రెండూ భారత్‌పై ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. ఆ రోడ్డు నేపాల్ భూభాగం నుంచి వెళ్తోందని ఆ దేశం ఆరోపించింది. కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ తమ భూభాగంలోనివని నొక్కిచెప్పింది. కొద్ది రోజులకే మే 18న ఆ ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇదీ చూడండి: చైనా బోర్డర్లో కొత్త రోడ్- సైన్యానికి మరింత వెసులుబాటు
నేపాల్ వాదనల్లో నిజమెంత..?
గుంజీ, కాలాపానీ మధ్య దూరం 10 కి.మీ. సముద్రమట్టానికి 11 వేల 700 కి.మీ. ఎగువన ఉన్న కాలాపానీ.. భారత్, నేపాల్ సరిహద్దు మధ్య ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతం. ఓ వైపు 1990 నుంచే కాలాపానీ తమ అధీనంలో ఉందని ఆరోపిస్తోంది నేపాల్. అయితే.. నిజమేంటంటే 1955 నుంచే భారత రక్షణ దళాలు కాలాపానీలో మోహరించి ఉన్నాయి. ఇంకా.. కాలాపానీ భూమి ఉత్తరాఖండ్‌లోని కర్బ్యాంగ్ గ్రామ భూ-రికార్డుల్లోనే నమోదై ఉంది. వీటిపైనా అక్కడి సాయుధ దళాలు, ఐటీబీపీ సిబ్బందిని అడిగి వాస్తవాలు తెలుసుకుంది ఈటీవీ భారత్.
వివాదం ఏంటి..?
1816లో జరిగిన ఒప్పందం తర్వాత.. భారత్, నేపాల్ మధ్య సరిహద్దు అధికారికంగా అమల్లోకి వచ్చింది. నేపాల్ రాజు, బ్రిటీష్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. కాళీ నది పశ్చిమ భాగం బ్రిటీష్ ఇండియాకు చెందుతుంది. ఏదేమైనా, రెండు శతాబ్దాల క్రితం సంతకం చేసిన సుగౌలీ ఒప్పందంలో కాళీ నది మూలం గురించి స్పష్టత లేదు. అదే వివాదానికి దారితీసింది.
అయితే.. కాళీ నది పుట్టే ప్రాంతమే కాలాపానీ అని భారత్ విశ్వసిస్తోంది. నేపాల్ మాత్రం.. లింపియాధురా నుంచి ఉద్భవించిన కుట్టియాంగ్తీ నది కాళీ నదికి జన్మస్థానమని వాదిస్తోంది. లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు భారత భూ రికార్డుల్లో.. గుంజీ గ్రామానికి చెందిన అటవీ భూములుగా నమోదై ఉన్నాయి.
కాళీ నది మూలం ఆలయమే...
కాలాపానీలో కాళీ నది మూలం కాళీ ఆలయం. అప్పటి ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ భారత్‌కు చెందిన ఐటీబీపీ దళాలే చూసుకునేవి. దీని ప్రకారం.. ఆలయ గర్భగుడి నుంచే కాళీ నది ఉద్భవించిందని భారత్ గట్టిగా నమ్ముతోంది. ఈ ఆలయానికీ వెళ్లిన 'ఈటీవీ భారత్' వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడి నుంచి నీరు.. లిపులేఖ్లోని లిపు నదికి ప్రవహిస్తాయి. కాళీ నదినే కాలక్రమేణా శారదా, ఘాంఘ్రా నదులుగా పిలుస్తున్నారు.
కాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రాంతం ట్రై జంక్షన్ లాంటిది. నేపాల్, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి కీలక ప్రాధాన్యం ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యం ఉందో కాలాపానీకి కూడా అంతే గుర్తింపు ఉంది.
మధ్యలో చైనా...
అప్పటి నుంచే చైనా కూడా.. లద్దాఖ్ సరిహద్దు వెంబడి దూకుడుగా వ్యవహరించింది. ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలుపెట్టాలని చైనా యోచిస్తోంది. ఇప్పటికే నేపాల్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగాను వ్యూహాలు పన్నుతోంది. ట్రైజంక్షన్‌గా ఉండటం వల్ల కాలాపానీలో కాలుపెడితే పైచేయి సాధించవచ్చన్నది చైనా యోచన.
అదే భారత్‌కు బలం...
చైనా సరిహద్దులోని లిపులేఖ్ వరకు రహదారి పూర్తయిన తర్వాత భారత రక్షణ సామర్థ్యం మెరుగైంది. 1962లో చైనా దురాక్రమణ చర్యల తర్వాత అప్రమత్తమైన భారత్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక్కడ నభిధాంగ్ వద్ద 15 వేల అడుగుల ఎత్తులో భారత సైనిక స్థావరం ఉంది. అంతకుమించి.. లిపులేఖ్ వరకు ఐటీబీపీ, భారత సైన్యం సంయుక్తంగా పకడ్బందీగా గస్తీ కాస్తున్నాయి.
రక్షణ పరంగా చూస్తే.. నభిధాంగ్ ప్రాంతం భారత్, చైనా, నేపాల్‌కు అత్యంత కీలకం. లిపులేఖ్‌కు రోడ్డు పూర్తయిన తర్వాత.. వ్యూహాత్మకంగా భారత్ బలోపేతం అయింది. సరిహద్దు ప్రాంతంలో నివసించే వారిలోనూ భయాందోళనలు తొలిగాయి. వారు.. కాలాపానీ భారత అంతర్భాగమేనని నమ్ముతారు.