ETV Bharat / bharat

కడ్డీ వంగినా.. మెడ వంచని.. జెండా దించని యోధుడు - మచిలీపట్నం తోట నర్సయ్య నాయుడు

అప్పటికి స్వాతంత్య్రం రాకున్నా మువ్వన్నెల జెండాను చూస్తే ప్రతి ఒక్కరిలోనూ ఓ పూనకం.. చేతబట్టడం ఓ గౌరవం.. ఆంగ్లేయుల ముందు దాన్ని నిలబెట్టడమంటే జన్మధన్యమైనట్లే! ఆ భావనే ఎంతోమందిని సమర యోధులను చేసింది. ఆంగ్లేయులను ఎదిరించేందుకు పురిగొల్పింది. జెండాను రెపరెప లాడించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన బందరు యోధుడే తోట నర్సయ్యనాయుడు.

thota narasaiah naidu news
thota narasaiah naidu news
author img

By

Published : Jun 28, 2022, 7:58 AM IST

ఈస్టిండియా కంపెనీ తొలి మజిలీల్లో ఒకటైన బందరు (మచిలీపట్నం) స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. దేశంలో జరిగిన కీలక ఘటనలన్నింటికీ ఇక్కడ స్పందన వేగంగా ఉండేది. ఈ క్రమంలో ఉప్పుసత్యాగ్రహంలో ఉన్న గాంధీజీని అరెస్టు చేశారని తెలియడంతో 1930 మే 6న బందరు ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, శాంతి సైనికులు ఊరేగింపుగా సత్యాగ్రహ శిబిరం నుంచి తిలక్‌చౌక్‌కు బయల్దేరారు. ఎలాగైనా జెండా ఎగరవేయాలని వీరు.. వమ్ము చేయాలని బ్రిటిష్‌ పోలీసులు పట్టుదల ప్రదర్శించారు. కార్యకర్తలు శాంతియుతంగా ఒకరితర్వాత ఒకరు ముందుకు రావటం కుండు స్తంభం ఎక్కడం.. పోలీసులు లాగడం.. కాసేపటి దాకా ఇదే నడిచింది. ఓపిక నశించిన పోలీసులు.. లాఠీఛార్జి చేసి అందరినీ చెదరగొట్టేందుకు యత్నించారు.

పక్కనే ఉండి పోలీసుల దాష్టీకాన్ని గమనించిన మల్లయోధుడు తోట నర్సయ్య నాయుడు ఆగ్రహంతో రంగంలోకి దూకారు. పోలీసులను తోసుకుంటూ.. జెండా కర్రను చేతపట్టుకొని కుండుస్తంభం ఎక్కసాగారు. మిగిలిన కార్యకర్తల్లా ఆయనపై ఒకరిద్దరు పోలీసుల ప్రభావం కనిపించలేదు. లాఠీలు విరిగాయే తప్ప ఆయన ఆగలేదు. దీంతో.. 15 మంది పోలీసులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. చొక్కాపట్టుకు లాగారు. అది చినిగిపోయినా నాయుడు మాత్రం ఆగకుండా పైకి ఎక్కసాగారు. దీంతో లాఠీలతో గొడ్డును బాదినట్లు బాదారు. బూట్లతో డొక్కల్లో తన్నారు. నిచ్చెనకు ఒరిగి అలాగే దెబ్బలను తట్టుకుంటూ పైకి ఎక్కడానికి ప్రయత్నించారు. పోలీసుల దెబ్బలకు నిచ్చెన ఇనుప కడ్డీ వంగిపోయిందిగానీ నర్సయ్యనాయుడు మాత్రం మెడ వంచలేదు. కింది నుంచి ఇదంతా చూస్తున్న నర్సయ్య శిష్యులైన వస్తాదులు ఆగ్రహంతో పోలీసులపై దాడికి దిగబోగా కాంగ్రెస్‌ శాంతిసైనికులు వారిని వారించారు. పోలీసులు కావాలనే రెచ్చగొడుతున్నారని, హింస జరిగితే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందంటూ నిగ్రహించారు. పోలీసుల దెబ్బలకు తాళలేక నర్సయ్యనాయుడు స్పృహకోల్పోయారు. ఆయన చేతిలోని జెండా అలాగే ఉంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు నర్సయ్యనాయుడిని మంచంపై చికిత్సకోసం మోసుకెళ్లారు. మధ్యలోనే స్పృహలోకి వచ్చిన ఆయన కిందికి దుమికి జెండా గద్దెవైపు పరుగెత్తారు. కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గుర్తించిన కార్యకర్తలు అందుకు అంగీకరించలేదు. ఆయనా వినలేదు. దీంతో వారంతా మానవహారంగా మారి.. నర్సయ్యనాయుడిని బలవంతంగా బంధించి శిబిరానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. నర్సయ్య ధైర్య సాహసాల్ని కొనియాడుతూ.. పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ బందరు పట్టణంలో ఆ రోజు హర్తాళ్‌ జరిగింది. ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. మరో చౌరీచౌరా ఘటన పునరావృతమయ్యేలా కన్పించింది. దీంతో అప్పటి మున్సిపల్‌ ఛైర్మన్‌ శీలం జగన్నాథరావునాయుడు ప్రజల్ని సముదాయించారు. పురపాలక సంఘం కార్యాలయంపై తానే స్వయంగా త్రివర్ణపతాకం ఎగరేసి ఉద్రిక్తతను తగ్గించారు. జెండా వీరుడిగా తోట నర్సయ్యను కీర్తించారు.

ఉప్పు పిడికిలి తెరవలేదు..: చల్లపల్లి సమీపంలోని పాగోలులో 1899లో జన్మించిన నర్సయ్య నాయుడు పెద్దగా చదువుకోలేదు. బాల్యం నుంచే సాముగరిడీలు, కుస్తీల వైపు మొగ్గుచూపి మల్లయోధుడయ్యారు. ఆయన కుస్తీ పట్లు చూసిన వల్లూరు రాజా బందరు తీసుకొచ్చి తాలింఖానా ఏర్పాటు చేయించారు. నర్సయ్యనాయుడు పర్యవేక్షణలో అనేక మంది వస్తాదులను తయారు చేశారు. చదువు లేకున్నా గాంధీజీ కారణంగా జాతీయోద్యమం పట్ల ఆకర్షితులైన నర్సయ్యనాయుడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చట్టాల్ని ఉల్లంఘించి చిన్నాపురం నుంచి ఉప్పు తీసుకు వచ్చారు. ఆయన చేతిలోంచి ఉప్పు లాక్కోవటానికి పదుల సంఖ్యలో పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన గుప్పిలి విప్పించలేకపోయారు. విదేశీ వస్త్రబహిష్కారానికిగాను 18నెలల జైలుశిక్ష అనుభవించారు నర్సయ్య నాయుడు. దిల్లీలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ సభలకు హాజరై గాంధీ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, సుభాష్‌చంద్రబోస్‌లను కలసి వచ్చారు. తర్వాత మద్రాసు రాష్ట్ర మోటార్‌ వర్కర్ల యూనియన్‌కు నాయకత్వం వహించారు. తన ముగ్గురు కొడుకులకు బిపిన్‌చంద్రపాల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పేర్లు పెట్టారు. 1964 అక్టోబరు 12న బందరులో మరణించిన నర్సయ్యనాయుడికి బతికున్నప్పుడే ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇస్తానన్నా తిరస్కరించారు.

ఇదీ చదవండి: ఆంగ్లేయులపై మహిళలతో తుపాకులు ఎక్కుపెట్టించిన నేతాజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.