Attempt to Burn Woman Alive: శాస్త్ర సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలతోనే జీవిస్తున్నారు. తాజాగా తాంత్రికురాలనే నెపంతో ఓ మహిళను సజీవం దహనం చేసేందుకు యత్నించారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది. మహిళ గుడిసెలో ఉండగానే నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. తప్పించుకున్న ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అజ్మీర్‌లోని నౌచాన్ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా గుడిసెలో జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన మోహన్, శ్యామల, దుర్గ, చోటు, పవన్ అనే వ్యక్తులు మహిళను తాంత్రికురాలు అంటూ వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళ గుడిసెలో వంట చేసుకుంటుండగా.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనిని గమనించిన మహిళ తప్పించుకుని బయటకు వచ్చింది. అనంతరం బాధితురాలిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఆమె నాలుక కోసేందుకు యత్నించగా.. ప్రతిఘటించింది. ఈ క్రమంలో వారు బాధితురాలిపై దాడి చేయగా ఆమె పన్ను ఊడిపోయింది. గ్రామం నుంచి పారిపోవాలని.. ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. గ్రామంలో బాధితురాలి బంధువులు ఉన్నా.. వారు కూడా నిందితుల పక్షానే నిలబడ్డారు. అక్కడి నుంచి తప్పించుకుని బయట పడ్డ మహిళ.. మాజీ సర్పంచ్ సాయంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. మహిళ ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: డీజే పాటలతో బరాత్.. నోరూరే వంటలతో విందు.. గ్రాండ్‌గా పెంపుడు కుక్కల పెళ్లి