జనాభా నియంత్రణకు(population control news) 'పాపులేషన్ ఆర్మీ' పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అసోం ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నదీ పరివాహ ప్రాంతాల్లో నివసిస్తున్న మైనారిటీల జనాభా వృద్ధిపై దృష్టిసారించాలని భావిస్తోంది. జనాభా నియంత్రణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శెర్మాన్ అలీ అహ్మద్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
" రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు సుమారు 1,000 మంది యువతతో పాపులేషన్ ఆర్మీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. దాంతో పాటుగా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఏఎస్హెచ్ఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీరు జనాభా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించటం, మహిళలకు గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేస్తారు. అలాగే.. అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 20కి పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. "
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి.
నదీ పరివాహక ప్రాంతాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, కొన్ని జిల్లాల్లో బాల్యవివాహాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపైనా దృష్టి సారించాలని కోరారు అలీ. కాంగ్రెస్ నేత అడిగిన ప్రశ్నలకు.. జనాభా నియంత్రణ విధానం అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదని, పేదరికానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు సీఎం. 2001-2011 వరకు హిందువులు, ముస్లింల జనాభలో చాలా మార్పులు వచ్చినట్లు చెప్పారు. 'హిందువుల్లో జనాభా తగ్గితే.. ముస్లిం జనాభాలో పెరుగుదల నమోదైంది. అది చాలా సమస్యలకు దారితీసింది. హిందువుల్లో జనాభా తగ్గుదలతో వారి జీవన విధానం మెరుగైంది. ముస్లింలో జనాభా పెరగటం వల్ల వారి జీవితాలపై ప్రభావం చూపింది ' అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: 'అభివృద్ధికి ఆటంకంగా జనాభా పెరుగుదల'