Army day 2022: దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఘన నివాళులు అర్పించారు భారత సాయుధ దళాల అధిపతులు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. గౌరవవందనం చేసి పుష్పగుచ్చం సమర్పించారు. భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె, వాయుసేన చీఫ్ వీఆర్ చౌదరి, నేవీ సారథి ఆర్ హరికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కవాతులో పాల్గొన్నారు త్రివిధ దళాల సారథులు. ఘనంగా ఆర్మీ డే వేడుకలు నిర్వహించారు. సైన్యంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు పతకాలు అందజేశారు.
అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. వీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని కొనియాడారు.
అగ్గిపుల్లలతో యుద్ధ ట్యాంక్..
ఆర్మీ డే సందర్భంగా ఒడిశాకు చెందిన సస్వత్ రంజన్ సాహు T-90 యుద్ధ ట్యాంకు కళాకృతిని రూపొందించాడు. 1,774 అగిపుల్లలతో ఈ సూక్ష కళాకండాన్ని రూపొందించాడు. అమర జవాన్లకు నివాళిగా దీన్ని రూపొందించినట్లు చెప్పాడు.
750 మీటర్ల కాగితపు చుట్ట
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన వర్క్‌షాప్ నిర్వహించింది నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. కళా కుంభ్ పేరుతో 750 మీటర్ల పరిమాణంలో ఉన్న భారీ స్క్రోల్స్‌ను(కాగితపు చుట్టలు) ప్రదర్శించింది. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో పోరాడిన వీరుల కథలను వివరించేలా దీన్ని రూపొందించారు.
అతిపెద్ద జాతీయ పతాకం..
ఆర్మీ డే సందర్భంగా ఖాదీతో తయారు చేసిన, ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాకమైన మువ్వన్నెల జెండాను భారత్-పాక్ సరిహద్దు ప్రాంతం జైసల్మేర్‌లో ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా లేహ్‌లో దీన్ని ఆవిష్కరించారు. అప్పటినుంచి అరుదైన సందర్భాల్లో ఇప్పటివరకు ఐదు సార్లు ప్రదర్శించారు.
ఇదీ చదవండి: సాహో సైనికా.. నీ తెగువకు సాటిరారెవరైనా..!