బంగాల్ శాసనసభ ఐదో విడత ఎన్నికలు పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. 45 స్థానాలకు గాను 319 అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
అక్కడక్కడా ఉద్రిక్తతలు..
కామర్హతిలోని బూత్ నెం.107లో అభిజిత్ సమంత్ అనే భాజపా పోలింగ్ ఏజెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. మృతిచెందారు. బూత్ నెం.265, 272లలో భాజపా కార్యకర్తల రాళ్లదాడిలో ఇద్దరు తృణమూల్ కార్యకర్తలు గాయపడ్డారని మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. ఉత్తర 24 పరగణాలు జిల్లా దేగంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కురల్గచ్చా పోలింగ్ బూత్ వద్ద కేంద్రం బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి.
పోలింగ్ వాయిదా..
జంగీపుర్ నియోజకవర్గం రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థి ప్రదీప్ నంది మృతి కారణంగా అక్కడ ఎన్నికలను వాయిదా వేసినట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. ఏడో విడత పోలింగ్లో భాగంగా ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : '70 ఏళ్ల కాంగ్రెస్ కష్టాన్ని వృథా చేశారు'