దేశవ్యాప్తంగా.. 1901 నుంచి ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాల్లో 2020 ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే.. 2016లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. 2020లో వేడి గణనీయంగా తగ్గిందని భారత వాతావారణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. కానీ గత రెండు దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు(0.23, 0.34 డిగ్రీల సెల్సియస్) పెరిగాయని పేర్కొంది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. 1901 నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదైన 15 సందర్భాలను తీసుకుంటే.. వాటిలోని 12 సంవత్సరాలు- గత 15 ఏళ్లలో(2006-2020)లోనే ఉండటం గమనార్హం. 1901-2020లో దేశ సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.62 డిగ్రీ సెల్సియస్‌కు పెరిగిందని ఐఎండీ తెలిపింది. ఈ వివరాల ఆధారంగా దేశవ్యాప్త సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రత.. సాధారణం కంటే 0.29 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
2020లో 1565మంది బలి..
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో దేశంలో ఒక్క 2020 ఏడాదిలోనే.. సుమారు 1,565మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో.. ఉరుములు, మెరుపుల కారణంగా 815మంది చనిపోయారని ఐఎండీ తెలిపింది. ఇందులో బిహార్‌లో అత్యధికంగా 379 మరణాలు సంభవించగా.. ఉత్తర్‌ప్రదేశ్(356) ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇక వరద సంబంధిత సంఘటనల కారణంగా సుమారు 600 మందికిపైగా మృతిచెందినట్టు ఐఎండీ పేర్కొంది. అందులో అసోం-129, కేరళ-72, తెలంగాణ-61, బిహార్-54, మహారాష్ట్ర-50 మరణాలతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: కోవిన్ యాప్: ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..