Nimmala on Jagan: బెదిరిస్తూ.. తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు: నిమ్మల - YSRCP attacks
🎬 Watch Now: Feature Video
Nimmala comments on CM Jagan: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలపై జగన్ కక్ష సాధింపులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయావర్గాలోని ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల్ని ఏదో రకంగా బెదిరించి.. తన దారికి తెచ్చుకునే ప్రయత్నాల్ని జగన్ ముమ్మరం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో శాంతారాముడనే విద్యావేత్తను కేసులతో భయపెట్టి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. గతంలో మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని ప్రముఖుల్ని భయపెట్టి దారికి తెచ్చుకొని ఆయా వర్గాలంతా తనతో ఉన్నాయని నమ్మించే దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ జోరు పెంచడంతో జగన్.. ముద్రగడతో చిలుకపలుకులు పలికిస్తున్నాడని విమర్శించారు. కాపుల ద్రోహి జగన్.. కాపుల నిజమైన నేస్తం చంద్రబాబేనని స్పష్టం చేశారు. జగన్ ఎన్నికుట్రలు చేసినా, సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా కాపుజాతిని లొంగదీసుకోలేడని విమర్శించారు. జగన్ చేసిన ద్రోహాన్ని కాపుజాతి ఎప్పటికీ మరువదని తెలిపారు.