Chandrababu on Jagan వైసీపీ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్: చంద్రబాబు - YCP government filed a case against Pawan Kalyan
🎬 Watch Now: Feature Video
Chandrababu comments on Jagan govt: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిలేని, నీతిమాలిన చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా అని మండిపడ్డారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్‌పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలన్నారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు.. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందని ఆక్షేపించారు. రాష్ట్రమా ఇది రావణ కాష్టమా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి.. ఈ అణచివేత ధోరణి మానుకోవాలని హితవు పలికారు. ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అన్నారు. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయని విమర్శించారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి.. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండని కోరారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి.. మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవని తెలిపారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.