Wife Killed Her Husband: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం - Kothamalampeta murder case
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 1:17 PM IST
Wife Killed Her Husband: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించాలని ప్రయత్నించింది. ఈ నెల 20వ తేదీన ఈ ఘటన జరగగా.. భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. దర్యాప్తులో భార్య, ప్రియుడు కలిసి హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమలంపేట గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తికి.. అదే గ్రామానికి చెందిన జానకితో 2014 సంవత్సరంలో వివాహమైంది. ఈ క్రమంలో జీవనోపాధి కోసమని గతంలో జానకి ఓ దుకాణంలో పనిచేసేది. ఆ సమయంలో ఆమెకు చింతల రాము అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధానికి భర్త అప్పలనాయుడు అడ్డుగా ఉన్నాడని.. అతడ్ని తొలగించుకోవటానికి వారిద్దరూ పథకం పన్నారు. వారి ప్రణాళిక ప్రకారమే భర్తకు మాయమాటలు చెప్పి కోటవురట్ల మండంలోని ఓ గుడికి తీసుకెళ్లింది. తిరుగుప్రయాణంలో బహిర్భూమికి వెళ్లాలని భర్తకు చెప్పి.. వారు ప్రయాణిస్తున్న బైక్ను ఆపమని భర్తను కోరింది. దీంతో భర్త బైక్ను రోడ్డు పక్కన ఆపాడు. వారిద్దరూ బైక్ దిగి సమీపంలోని జీడిమామిడి తోటలోకి వెళ్లారు. అక్కడే మాటు వేసుకుని కూర్చున్న ప్రియుడు చింతల రాము భర్త కంటపడకుండా జానకి ఏమార్చింది. ఈ క్రమంలో ప్రియుడు చింతల రాము తన వెంట తెచ్చుకున్న సుత్తితో అప్పలనాయుడు తలపై దాడి చేశాడు. వెంటనే అప్పలనాయుడు కిందపడిపోయాడు. వెంటనే బార్య జానకి, చింతల రాము ఇద్దరు కలిసి అప్పలనాయుడ్ని రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చారు. చింతల రాము అక్కడి నుంచి పారిపోగా.. జానకి మాత్రం తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని నమ్మించటానికి ప్రయత్నించినట్లు పోలీసులు వివరించారు.