VRAs Fired on YSRCP Govt: వీఆర్ఏలను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు: సీఐటీయూ నాయకులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 7:45 PM IST
VRAs Fired On YSRCP Govt: వీఆర్ఏల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ..సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రామ రెవెన్యూ సహాయకులు కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే, అక్రమంగా అరెస్టులు చేసి, నిర్బంధం చేస్తారా..? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. వీఆర్ఏల సమస్యల పరిష్కార విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
సీఐటీయూ నాయకులు మీడియాతో మాట్లాడుతూ..''వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'చలో విజయవాడ' కార్యక్రమం చేపడితే.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏల ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కి.. ఆ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించి తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కూడా వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలి'' అని డిమాండ్ చేశారు.