Viveka Murder Case Updates: ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించాలన్న వైఎస్ భాస్కర్ రెడ్డి.. విచారణ 3కి వాయిదా... - Viveka Murder Case
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 10:06 PM IST
Viveka Murder Case Updates: ఎస్కార్ట్ బెయిల్‌ను (YS Bhaskar Reddy Escort Bail) రెండు నెలలు పొడిగించాలంటూ.. వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి.. సీబీఐ కోర్టును కోరారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ఇటీవల నిరాకరించింది. అనారోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. సీబీఐ కోర్టును భాస్కర్ రెడ్డి అభ్యర్థించారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. గత నెల 22 నుంచి ఈనెల 3 వరకు భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది. 3వ తేదీ ఉదయం పదిన్నరకు లొంగిపోవాలని షరతు విధించింది. ఎస్కార్ట్ బెయిల్‌పై బయటకు రాగానే నేరుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పలు ఆరోగ్య పరీక్షలతో పాటు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్టు.. సీబీఐ కోర్టుకు భాస్కర్ రెడ్డి తెలిపారు. రెండు వారాల పాటు కంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈనెల 4న మరోసారి రావాలని వైద్యులు చెప్పారన్నారు. కాబట్టి రెండు నెలలు ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరారు. భాస్కర్ రెడ్డి అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ.. కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. అంగీకరించిన న్యాయస్థానం భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ ఈనెల 3కి వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డి లొంగుబాటును ఈనెల 3 వ తేదీ ఉదయం పదిన్నరకు బదులుగా సాయంత్రం ఐదున్నర వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.