Tulasi Reddy on Govt Advisers: 'ప్రభుత్వ సలహాదారులు కాదు.. సొమ్ము స్వాహాదారులు' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy Comments On Government Advisers : 'అత్త సొత్తు అల్లుడు దానం' చేసినట్లుగా ఒక్కొక్క సలహాదారుడికి నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి సలహాదారులు కాదు... ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి పెట్టిన స్వాహాదారులని ఆయన విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్క మైనారిటీ శాఖకే నలుగురు సలహాదారులా అని ప్రశ్నించారు. సలహాదారుల నియామకం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఉపాధి హామీ పథకంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సలహాదారులు సలహాలు ఇచ్చింది లేదు... ప్రభుత్వం వారి సలహాలు స్వీకరించింది లేదన్నారు.
ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కాంట్రాక్టులకు సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించే పరిస్థితే లేదన్నారు. 'మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె' అన్నట్లుగా సలహాదారులు నియామకం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...సలహాదారుల నియామకానికి స్వస్తి పలకాలని, ఇప్పటికే నియమించిన సలహాదారులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతిని ఆహ్వానించకుండా మోదీ ప్రభుత్వం అవమానిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ ప్రాపకం కోసం ప్రాకులాడడం దురదృష్టకరమన్నారు. జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు చెక్క భజన బాబుగా మారడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు.