Traffic Jam on NH 65: మున్నేరు ఉద్ధృతి.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో వాహనాలు దారి మళ్లింపు - రాష్ట్రంలో భారీ వర్షం
🎬 Watch Now: Feature Video
Traffic Jam on NH 65 For 2 KM Due to Rains : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH-65) ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు పొంగి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం జాతీయ రహదారిపైకి రావడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది.జాతీయ రహదారిపై దాదాపుగా 2 కిలోమీటర్ల మేర రాకపోకలు ఆగిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఒకవైపున మున్నేరు వాగు ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో.. రెండో వైపు నుంచి వాహనాలను పంపించేందుకు పోలీసులు యత్నించారు. భారీ వాహనాలను మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వాటిని పోలీసులు ఆపేశారు. తెలంగాణ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు భారీగా వరద వస్తోంది. దాదాపుగా లక్ష 30వేల క్యూసెక్కుల వరద నీరు మున్నేరును తాకింది. దీంతో జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకుంది. మున్నేరుతో పాటు కట్టలేరు, వైరా ఏరు వరద కూడా కలిసి ప్రవహిస్తుండటంతో ఒక్కసారిగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
నిలిచిన ఆర్టీసీ బస్సులు.. ఆందోళనలో ప్రయాణికులు : ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మున్నేరు వాగు వరద ఉద్ధృతితో ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు ఆపేశారు. వరద తగ్గే వరకు బస్సులు నడపలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. చిన్న వాహనాలను నందిగామ నుంచి మధిర మీదుగా మళ్లిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్ని దారి మళ్లించి వెళ్లేందుకు అనుమతి లేదని డ్రైవర్లు అంటున్నారు. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దారి మళ్లింపు : వరదల వల్ల విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులను దారి మళ్లించారు. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా పరిస్థితులను సమీక్షించారు. రూటు మార్చి హైదరాబాద్‌కు బస్సులు నడపాలని ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు. హుజూర్‌నగర్ , మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా ఏపీకి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు కీసర, ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ మీదుగా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాల మళ్లింపు సీపీ కాంతిరాణా తెలిపారు. గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖ వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కూడా మళ్లించారు. రాజమండ్రి, గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, నార్కట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. ఇబ్రహీంపట్నం, కీసర వద్ద ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.