పరిశ్రమలను రప్పించడం గొంతుపై కత్తిపెట్టినంత సులువు కాదు: నారా లోకేశ్ - YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 8:15 PM IST
TDP Nara Lokesh on Industries: పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం అంటే కాంట్రాక్టర్ పీకమీద కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందంటూ సీఎం జగన్ చేసిన వాఖ్యలను ఆయన గుర్తు చేశారు. 13.12 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు జరిగాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు. ఇదే విషయాన్ని సాక్షిలో తాటికాయంత అక్షరాలతో రాశారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఏడాదైనా మంత్రి చెప్పిన ఒక్క పరిశ్రమ రాలేదని విమర్శించారు. జే-ట్యాక్స్ బెడద భరించలేక జాకీ, లులూ వంటి ఎన్నో ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పరారైన విషయాన్ని తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు ముఖం చాటేశారన్నారు. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమను తరిమేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కాసుల కోసం 11మంది కూలీలను నిర్బంధిచారని ఆరేపించారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ఎంపీ ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాయడం రాష్ట్రానికే సిగ్గుచేటని మండిపడ్డారు. ఇటువంటి ప్రజాప్రతినిధులున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పరిశ్రమదారుడైనా ధైర్యం చేస్తాడా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో లోకేశ్ పోస్ట్ చేశారు.