వైసీపీ బస్సు యాత్రలో మంత్రులు ఫుల్, జనాలు నిల్
🎬 Watch Now: Feature Video
TDP leader Buddha Venkanna comments on Jagan: టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న అన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేస్తున్నది బీసీ సామాజిక బస్సు యాత్ర కాదని, బేవర్స్ యాత్ర అన్నారు. బస్సు యాత్రలో మంత్రులు ఫుల్, జనాలు నిల్ అని బుద్ధా ఎద్దేవా చేశారు. చంద్రబాబు గేట్లు ఎత్తితే వైసీపీలో ఎవరూ మిగలరన్నారు. దోచుకున్నవారు, దొంగలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరన్నారు.
నారా లోకేశ్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. పాదయాత్ర నిలుపుదల చేసేందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబు ప్రజలలోకి వస్తే జన సునామీ చూస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నిటిని ఎత్తివేస్తామన్నారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం అక్రమ అరెస్ట్లపైనే చేస్తామని తెలిపారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా పని లేని మంత్రులని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటివరకూ ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదన్నారు. ఒకవేళ ఎవరన్నా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న అది అవాస్తవం అన్నారు. రేపటి నుంచి కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగే నారా లోకేశ్ యాత్రలో టీడీపీతో పాటు జనసేన సైతం పాల్గొంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండకపోవచ్చు బుద్దా వెంకన్న తెలిపారు.