TDP Leader Bathyala Changal Rayudu Challenge to MLA Meda: "టైం ఎంతైనా.. ప్లేస్ ఏదైనా.. నేను రెడీ.. నువ్వు రెడీయా..?"
🎬 Watch Now: Feature Video
TDP Leader Bathyala Changal Rayudu Challenge to MLA Meda: అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి భూ ఆక్రమణలపై టీడీపీ నేత బత్యాల చంగల్ రాయుడు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై ఈనాడులో వచ్చిన వార్తలు వాస్తవాలు కాదా అని ప్రశ్నించారు. భూ కబ్జాలపై ఎమ్మెల్యే మేడా చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడా మల్లికార్జున్ రెడ్డి, అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరూ భూ అక్రమలకు పాల్పడలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 10 శాతం కూడా భూమిని అక్రమంగా చేపట్టలేదని చెప్పడం దారుణమన్నారు. 90% మేడా కుటుంబ సభ్యులు ఆక్రమణ చేపట్టినట్టు తాము నిరూపిస్తామని చెంగల్ రాయుడు సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్‌పై మేడా విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. మేడా మల్లికార్జున్‌రెడ్డి కుటుంబంలోని ఓ వ్యక్తిని ఇప్పటికే టీడీపీలోకి పంపి తాను కూడా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మేడా మల్లికార్జున్ రెడ్డికి ధైర్యం ఉంటే తాను విసిరే సవాలుకు సిద్ధంగా ఉండాలన్నారు. తన నాలుగు సంవత్సరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాలంలో ఎంత నిధులు రాజంపేట అభివృద్ధికి తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తాను సవాలుకు సిద్ధమని.. మేడా కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ చేసిందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరిగినా పాపాన పోలేదన్నారు.