పార్టీ అండతో భూ ఆక్రమణలు - వైసీపీ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు - ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల భూ ఆక్రమణలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 2:49 PM IST
Police Case on YCP Leader in Prakasam District: రాష్ట్రంలో భూమి కనిపిస్తే వైసీపీ నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ 9వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ మొఘల్ సిరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కాపురం మండలం గోగులదిన్నే గ్రామంలో శివారెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 72/2, 75/1లో 4.20 ఎకరాల భూమి తమదంటూ కౌన్సిలర్ సిరాజ్ దౌర్జన్యానికి దిగారని పోలీసులకు పిర్యాదు చేశారు.
తన పొలంలో అక్రమంగా దిగి కంచెను నష్టపరచడమే కాకుండా తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వైసీపీ కౌన్సిలర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు వైసీపీ నేత సిరాజ్ అధికార పార్టీ అండదండలతో గతంలోనూ పలు భూ అక్రమాలకు పాల్పడ్డారని పిర్యాదులు ఉన్నట్లు తెలిసింది.