ధాన్యం కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోంది: నిమ్మల రామానాయుడు - టీడీపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
MLA Nimmala Ramanaidu Comments: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం దోచుకుంటోందని.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏరువాక సందర్భంగా.. ధాన్యం రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా కాటా తీసుకుని ద్విచక్ర వాహనంపై రైతుల వద్దకు వెళ్లారు. ట్రాక్టర్ మీద ఉన్న బస్తా ధాన్యాన్ని తూకం వేశారు. 41 కేజీలు ఉండాల్సిన కట్ట.. 44 కేజీలు ఉందని, అంటే ప్రభుత్వం ఒక్కో కట్టకు 3 కేజీలు అదనంగా రైతుల వద్ద దోచుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడా ఏరువాక సంబరాలు కనిపించకపోగా.. రైతుల కళ్లల్లో నిరాశ, నిస్పృహ, నిర్వేదం కనిపిస్తున్నాయని నిమ్మల రామానాయుడు అన్నారు. ఖరీఫ్ పంటను ఏరువాకతో ప్రారంభించాల్సిన రైతులు ధాన్యం అమ్ముకోలేక రోజుల తరబడి రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారన్నారు. నాడు ధాన్యం అమ్మితే రైతులకు డబ్బులు వచ్చేవని.. కానీ నేడు ధాన్యం అమ్మాలంటే ఎదురు డబ్బులు మిల్లులకు కట్టాల్సి వస్తోందన్నారు. జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి... రైతులు పంట విరామం బాట పడుతున్నారని నిమ్మల విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా, రైతు దగా కేంద్రాలుగా తయారయ్యాయని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.