Minister Rajendra's Review of APSSDC Dash Board : 'స్కిల్ యూనివర్స్' డ్యాష్ బోర్డు ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 8:06 PM IST
Minister Rajendra's review of APSSDC Dash Board : స్కిల్ యూనివర్స్ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోన్న ఈ డాష్ బోర్డును త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఆటోనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన సమీక్ష నిర్వహించారు. ట్రైనింగ్, ప్లేస్ మెంట్ లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్ సంయుక్త శిక్షణ వివరాలు పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర యువతీ, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునే వారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో ప్లేస్ అయినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్ లైన్ పోర్టల్ లో అప్ డేట్ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
యువత నమోదు చేసిన వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్ వీటే(రెజ్యుమె) తయారయ్యే అత్యాధునిక వెసులుబాటు కల్పిస్తున్నట్లు డాష్ బోర్డు సౌకర్యాల గురించి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంత్రికి తెలిపారు. ఆధార్ లాగ్ ఇన్, కాప్చ పాస్ వర్డ్ తో ఎవరైనా సులభంగా లాగిన్ అయ్యేలా తీర్చిదిద్దుతున్నామని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్ మంత్రి బుగ్గనకు వివరించారు. వెబ్ పోర్టల్ పై తుది కసరత్తు జరుగుతుందన్నట్లు తెలిపారు. వాటర్ మేనేజ్ మెంట్ ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. సాంకేతిక, నైపుణ్య విద్య నేర్చుకునే యువతీ యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ల్యాబ్ టెక్నిషిన్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆవశ్యకతే ప్రామాణికంగా ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగాల ప్రాధాన్యత తెలిసేలా ఒక నివేదిక అందించాలని ఉపాధి, శిక్షణ శాఖ, సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్లను మంత్రి బుగ్గన ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, హాస్టల్ లలో తక్షణం చేపట్టాల్సిన నియామకాల వివరాలను సాంకేతిక శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగాలపై స్పష్టమైన జాబితా సిద్ధం చేయాలని మంత్రి బుగ్గన మార్గనిర్దేశం చేశారు.