JANASENA: గుంటూరు జిల్లాలో జనసైనికుల ధర్నా..
🎬 Watch Now: Feature Video
JANASENA PROTEST: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం చెరువుకు మరమ్మతులు చేయాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాజధాని ప్రాంతానికి వెళ్లే కీలకమైన రహదారి చెరువు కోతకు గురవుతోందని.. దానికి మరమ్మతులు చేయాలని.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని తెలిపారు. దీంతో ప్రభుత్వం వెంటనే చెరువు మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు ధర్నాకు దిగారు. గుంటూరు నుంచి సచివాలయం, శాసనసభ, హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి రోజురోజుకూ కోతకు గురవుతోందని జనసేన నాయకులు తెలిపారు. దీనివల్ల తరచూ ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. గతంలో రహదారి కనిపించక కారు చెరువులో పడి అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని నిరసనకారులు చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో చెరువు మరమ్మతు పనులు ప్రారంభించకపోతే వాహన రాకపోకలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.