ప్రజాప్రతినిధుల పెండింగ్ కేసులపై హైకోర్టులో విచారణ - పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 4:08 PM IST
High Court hearing on Pending Cases of MP and MLAs: ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల అంశంపై నమోదు చేసిన సుమోటో పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది . మొత్తం ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కి న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి హైకోర్టు మానిటరింగ్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసిన విచారణ జరిపింది.
వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులు ఉన్న ప్రజాప్రతినిధులలో ఆందోళన నెలకొంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు కేసులో దోషిగా తేలి, రెండు సంవత్సరాలకు పైబడిన శిక్షార్హుడు అయితే, అతడి సభ్యత్వాన్ని రద్దుచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి ఎవరైనా, తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు ఓ తీర్పు సందర్బంగా స్పష్టం చేసింది.
అనర్హత వేటుపడిన నేతలు: కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై అప్పటో లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2009 నాటి హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ, కవరత్తిలోని స్ధానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో అతనిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాహుల్ గాంధీ: 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ గాంధీ దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. ఇదే అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు వెళ్లారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం ద్వారా మళ్లీ ఎంపీగా కొనసాగుతున్నారు.