Farmers Agitation: గుంటూరు ఛానల్ పొడిగించాలని రైతుల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం
🎬 Watch Now: Feature Video
Farmers Agitation for Guntur Channel Extension: గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు వాహిని పొడిగింపు పనులకు నిధులివ్వాలంటూ పెదనందిపాడులో రైతులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డును దిగ్బంధించడంతో గుంటూరు - పర్చూరు మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహిళలు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను ఆందోళన విరమించేందుకు పోలీసులు యత్నించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని.. ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేయటంతో ప్రస్తుతానికి ఆందోళన విరమించారు.
దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతానికి వచ్చి హామీ ఇచ్చినా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. జగన్ కూడా మాట తప్పారని మండిపడ్డారు. నాలుగేళ్లు దాటినా హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కనీసం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి గుంటూరువాహిని పొడిగింపు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పొడిగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాడతామని రైతులు స్పష్టం చేశారు.