వైఎస్సార్సీపీ నేతల వేధింపులు - రైతు ఆత్మహత్యాయత్నం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 7:58 PM IST
Farmer tries to commit suicide: అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. చిల్లకల్లులోని చెరువుకు ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక రైతు ఆదినారాయణకు పొలం ఉంది. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడి పొలంలో బోరు కోసం ఆదినారాయణకు చెందిన పొలంలో విద్యుత్ స్తంభాలు పాతారు. దీనిపై ప్రశ్నిస్తే, దిక్కున్న చోట చెప్పుకోమని అధికార పార్టీ నేతలు బెదింపులకు పాల్పడ్డారు. ఇదే అంశంపై గతంలో విద్యుత్ ఏఈకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ లైన్ విషయంలో ఆదినారాయణ కుటుంబాన్ని సంప్రదించిన తరువాతే విద్యుత్ స్తంభాలు వేస్తామని ఏఈ చెప్పారు. కానీ, ఆదినారాయణ కుటుంబానికి తెలియకుండా విద్యుత్ స్తంబాలు పాతారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు ఆదినారాయణ పొలంలోనే పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఆదినారాయణను ఆసుపత్రికి తరలించినట్లు అతని మనవడు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులమన్న కారణంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆదినారాయణ కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు పింఛన్ రాకుండా అడ్డుపడుతున్నారని, ప్రభుత్వ బోరు వెయ్యకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దొంగల జానకీరామయ్యతో పాటుగా తమ పక్క పొలానికి చెందిన సైదేశ్వరారవులే ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలిపారు.