దేశాలు దాటినా స్వదేశ సంస్కృతిపై ప్రేమ.. కూచిపూడితో గిన్నిస్ రికార్డు
🎬 Watch Now: Feature Video
Records with Kuchipudi Dance: భారతీయ సంస్కృతి సంద్రాయాలు పట్ల తమకున్న మక్కువతో తమ బిడ్డల ద్వారా నేటి తరాలకు దేశ సంస్కృతిని అందించాలనుకున్నారు ఆ దంపతులు. అందుకోసం వారి పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తున్నట్లు చిన్నారుల తల్లి తెలిపింది. వృత్తిరీత్యా దుబాయ్‌లో స్థిరపడిన వారి పిల్లలకు కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తూ పలు ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చినందుకు వారి పెద్ద కుమార్తె నైషితను పలు అవార్డులు వరించాయి.
ఏలూరుకు చెందిన వృత్తిరీత్యా వైద్యుడైన శశికుమార్‌కు గుడివాడకు చెందిన రంజిషాతో వివాహమైంది. ఈ దంపతులకు నైషిత, సోహిత అనే ఇద్దరు సంతానం. వీరిద్దరూ చాలా సంవత్సరాల క్రితం వృత్తిరీత్యా దుబాయ్‌కు వెళ్లారు. అక్కడే వైద్యులుగా స్థిరపడ్డారు. వారు దేశం విడిచి వెళ్లిన మాట నిజమే కానీ, వారి ఆలోచన మాత్రం పూర్తిగా స్వదేశం పైనే ఉండిపోయింది. దుబాయ్‌లో స్థిరపడినా.. భారత సాంస్కృతిక నృత్యమైన కూచిపూడిని వారి చిన్నారులకు నేర్పించాలని అనుకున్నారు.
చిన్నారులకు నాట్యం నేర్పించటానికి మార్గాలను వెతికారు. బాల త్రిపుర సుందరి నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో భవానీ తొనకనూరి వద్ద.. ఆన్లైన్లో చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తున్నారు. మొదటి ఐదు సంవత్సరాలు మాత్రం ప్రీతి తాతంబోట్ల వద్ద నృత్య శిక్షణ ఇప్పించారు. వీరి పెద్ద కుమార్తె నైషిత పది సంవత్సరాల నుంచి నృత్యం నేర్చుకోవటమే కాకుండా పలు ప్రదర్శనలను సైతం ఇస్తోంది. చిన్నారి ప్రదర్శలనకు గౌరవంగా పలు అవార్డులు వరించాయి. 2016 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం కాగా.. 2020లో నర్తన బాల అవార్డు, 2021లో నృత్య కళా జ్యోతి అవార్డులు నైషితాను వరించాయి.
చిన్నారి నృత్య ప్రదర్శనలో భాగంగా.. ఇటీవల ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో నైషిత నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఇంద్రకీలాద్రిలో నృత్యం చేయటం తనకు సంతోషంగా ఉందని చిన్నారి తెలిపారు. దేశ సంస్కృతిని కూచిపూడి నృత్యం ఆవశ్యకతను నేటి తరాలకు తెలిపేందుకే.. దుబాయ్‌లో ఉన్నా తమ చిన్నారులకు నృత్యాన్ని నేర్పిస్తున్నామని చిన్నారి తల్లి రజిషా తెలిపారు. రామయణం, హరిగిరి నందిని, రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలను తమ చిన్నారులు నృత్య రూపకం ద్వారా ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రదర్శన కోసం ప్రత్యేకంగా దుబాయ్ నుంచి వచ్చినట్లు ఆమె వివరించారు.