CPI Ramakrishna comments on Jagan: సీఎం జగన్ పొలం బాట పట్టాలి... కరవు మండలాలను వెంటనే ప్రకటించాలి : సీపీఐ - రామకృష్ణ లైవ్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 7:36 PM IST
CPI Ramakrishna comments on Jagan: సాగునీరు లేక పంటలు ఎండి రైతులు అల్లాడుతుంటే... సీఎం జగన్‌కు కనిపించదా అంటూ... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై నవంబర్ 1న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని, ప్రాజెక్టులలో నీళ్లు లేవన్నారు.
పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 2వ తేదీ నుంచి సీపీఐ రాష్ట్ర నాయకత్వం 18 కరవు ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరవుపై నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్, వ్యవసాయ శాఖ మంత్రి పొలం బాట పట్టాలని హితవు పలికారు. సామాజిక బస్సుయాత్ర పేరుతో వైసీపీ మరో మోసానికి తెరతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పథకాల్లో కోత విధించిన జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయం ఎలా సాధిస్తుందంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.