100 Jio Towers in AP: మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు.. 100 జియో టవర్లు ప్రారంభించిన సీఎం - రిలయన్స్ సంస్థ
🎬 Watch Now: Feature Video
CM Jagan Launched 100 Jio Towers: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4G సేవలు అందించేందుకు రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసిన 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన టవర్లతో 209 మారుమూల ప్రాంతాల గ్రామాలకు సేవలందుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అల్లూరి జిల్లాలో 85, మన్యం జిల్లాలో 10, అన్నమయ్య జిల్లాలో 3, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు.
డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుందని రేషన్ పంపిణీ, ఈ–క్రాప్ బుకింగ్ కూడా సులభమవుతుందన్నారు. రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయనుండగా.. దీని కోసం ఇప్పటికే 2,463 చోట్ల ప్రభుత్వం స్థలాలు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.