ఒక్క రూపాయి నోటు ఉందా.. చికెన్ బిర్యానీ మీకే
🎬 Watch Now: Feature Video
Chicken biryani for One Rupee: నిన్న, మొన్నటివరకూ మాంసం ప్రియుల నుంచి ముక్కలేనిదే-ముద్ద దిగదు అనే మాట వినపడేది. కానీ, ఈ మధ్య బిర్యానీ తినందే - పొద్దు గడవట్లేదు అనే మాట బాగా వినిపిస్తోంది. అంటే భారతదేశంలో బిర్యానీ వంటకాన్ని ఇష్టపడేవారి సంఖ్య విపరీతంగా పెరిపోయిందని అర్థమవుతుంది. భారతీయ వంటకాల్లో సాధారణ వంటకంగా మారిన.. ఈ విదేశీ వంటకం పురాతన కాలం నాటిదని.. 'బిర్యానీ' అనే పదం పెర్షియన్ భాష పదమని నిపుణులు తెలిపారు. అయితే, భారతదేశంలో లభించే కొన్ని సాధారణ రకాల బిర్యానీలలో లక్నవి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కశ్మీరీ బిర్యానీ, అవధి బిర్యానీ, మురదాబాది బిర్యానీ, అస్సామీ కంపూరి బిర్యానీ, కోల్కతా బిర్యానీ వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో బిర్యానీ ప్రియుల కోసం నిర్వాహకులు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ.. తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ నూతన రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్న ఆఫర్ ప్రకటించి వార్తల్లోకి ఎక్కారు.
వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలో ఓ నూతన రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. ఇక, అంతే రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాంసం ప్రియులు ఉదయం నుంచి షాపు వద్ద క్యూ కట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. దీనిపై రెస్టారెంట్ యజమాని స్పందిస్తూ.. ఇంతమంది వద్ద రూపాయి నోట్ ఉందని తాను కూడా ఊహించలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికి సుమారు మూడు వందల మంది వరకు వచ్చారని.. ఇంకా మూడు వందల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తామని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరీ ఆలస్యమెందుకు మీ వద్ద రూపాయి నోట్ ఉంటే మార్కాపురం వెళ్లి బిర్యానీ తెచ్చుకోండి.