జగన్ ప్రభుత్వంలో మహిళలను వేటాడే నేరస్తులకు మాత్రమే సాధికారత : చంద్రబాబు - ఏపీ గ్యాంగ్ రేప్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 1:09 PM IST
Chandrababu condemns Vizag gang rape incident: విశాఖలో సాముహిక అత్యాచార ఘటన క్రూరమైన దాడి అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకుంటున్నట్లు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలిత ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లేవని ఆరోపించారు. అందుకే నేరస్థులు చట్టానికి భయపడకుండా ఆడబిడ్డలపై దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళా సాధికారతను ఈ ప్రభుత్వం మర్చిపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ దార్శనికత కేవలం మహిళలను వేటాడే నేరస్తులకు మాత్రమే సాధికారత కల్పించేలా కనిపిస్తోందని మండిపడ్డారు.
విశాఖ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఓ వ్యక్తి, అతడి స్నేహితుడు అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకొని బయట పడ్డ బాలికపై, మరో ఎనిమిది మంది రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని మహిళ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దురు పరారిలో ఉన్నారు. పరారిలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టారు.