AP BJP Chief Purandeswari Comments: మద్యం అవినీతిలో కర్త, కర్మ, క్రియ వైసీపీ ప్రభుత్వమే: పురందేశ్వరి
🎬 Watch Now: Feature Video
AP BJP Chief Purandeswari Comments: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి సీఐడీ విచారణ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి స్పందించారు. స్కిల్ స్కామ్ పేరుతో చంద్రబాబును జైలులో పెట్టారన్న ఆమె.. పూర్తి వివరాలతోనే కేసు పెట్టారా అని ప్రజలకు అనుమానం కలుగుతుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐడి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లి విచారణ చేపట్టారా అని ప్రశ్నించారు. తమ పరిశీలనలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు అవసరమైన వసతులను స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లు తేలిందని పురుందేశ్వరి పేర్కొన్నారు.
మద్యం ద్వారా రూ. 25 వేల కోట్లు దోచుకున్నారు.. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని అమ్మి వారి ప్రాణాలు తీస్తున్నారని పురుందేశ్వరి విమర్శించారు. మద్యంలో భారీ దోపిడీ (Liquor scam) సాగుతోందని ఆరోపించారు. మద్యం కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు వేల కోట్ల డబ్బు అక్రమంగా అందుతుందని దుయ్యబట్టారు. రూ.15కే లీటర్ మద్యం తయారుచేసి.. వందల రూపాయల లాభానికి ప్రజలకు అమ్ముతున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. మద్యం నుంచి అక్రమంగా అధికార పార్టీ పెద్దలు రూ.25 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. క్రిసిల్ అనే సంస్థ రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం 35శాతం మంది మద్యం సేవిస్తున్నారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15శాతం మంది మద్యం సేవిస్తున్నారన్నారు. ఏటా 57 వేల కోట్ల ఆదాయం వస్తుంటే... బడ్జెట్ లెక్కల్లో 20 వేల కోట్లు మాత్రమే చూపిస్తున్నారని గుర్తుచేశారు. మిగిలిన సొమ్ములు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. 2024కి స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్... మద్యం బాండ్లపై అప్పు తీసుకునేటప్పుడు ఎలాంటి నిషేధం విధించబోమని చెప్పడంలో ఆంతర్యమేంటని నిలదీశారు.