AP GOVT MOU WITH ETS: అంతర్జాతీయ ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం: సీఎం జగన్ - AP Govt Agreement with ETS organization
🎬 Watch Now: Feature Video
AP Govt Agreement with ETS organization: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను టోఫెల్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఈటీఎస్ (ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌తో ఈటీఎస్ (ETS) ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా టోఫెల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ప్రభుత్వం ఒప్పందం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టోఫెల్ పరీక్షల నిర్వహణ దిశగా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (E.T.S)తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈటీఎస్ తరఫున ఆ సంస్థ రెవెన్యూ ముఖ్య అధికారి లెజో సామ్ ఓమెన్ సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సంతకాలు చేశారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు.. ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇక, ఈటీఎస్ విషయానికొస్తే.. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఈ టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో ఉన్న ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.