14 Days Remand for Danda Nagendra: దండా నాగేంద్రను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. 14 రోజులు రిమాండ్
🎬 Watch Now: Feature Video
14 Days Remand for Danda Nagendra: పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన వైసీపీ మాజీ నేత దండా నాగేంద్రకు సత్తెనపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. తెలంగాణా మద్యం అక్రమ రవాణా కేసులో అమరావతి పోలీసులు నాగేంద్రను ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లి కోర్టులో దండా నాగేంద్రను హాజరుపరిచారు. అయితే, రిమాండ్ రిపోర్టు సరిగా లేదని న్యాయమూర్తి చెప్పటంతో దాన్ని సరిచేసి సోమవారం మరోసారి కోర్టులో ప్రవేశపెట్టారు.
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు: సత్తెనపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నాగేంద్రకు 14 రోజులు రిమాండ్ విధించింది. సత్తెనపల్లి కోర్టు వద్ద నాగేంద్రను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కలిశారు. న్యాయవాదులతో మాట్లాడారు. నాగేంద్ర కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దండా నాగేంద్ర జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేశారు. తవ్వకాలు ఆపేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కక్ష పెంచుకుని తప్పుడు కేసులు బనాయించిందని ఆనంద్ బాబు ఆరోపించారు. తన భర్త అరెస్టుకు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కారణమని, తన భర్తను చంపేందుకు కుట్ర పన్నారని నాగేంద్ర భార్య అనూష ఆరోపించారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, కనీసం సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆరోపించారు.
వర్ల రామయ్య: అవినీతిపై పోరాడే సమాజ సేవకుడు దండా నాగేంద్రకుమార్ పై దొంగ (తప్పుడు) కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ప్రభుత్వాన్ని ఇసుక తవ్వకం ఆపమన్నందుకు నాగేంద్రను శిక్షిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ డీజీపీకి వర్ల రామయ్య లేఖ రాశారు.