ఏడాది నుంచి కొవిడ్ వలన ఇబ్బందులు పడిన రైతులు.. ఇప్పుడు అధిక వర్షపాతం కారణంగా నష్టపోతున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలు మండలాలకు చెందిన కూరగాయల సాగుదారులు.. విత్తనాలు సరిగా లేక దిగుబడి తగ్గందని వాపోతున్నారు. ఎకరాకు 7,8 టన్నుల దిగుబడి వస్తుందని వాటి కొనుగోలు సమయంలో వ్యాపారులు చెప్పగా.. నమ్మి మోసపోయామన్నారు.
లాభాలు వస్తాయనుకున్నాం కానీ...
'పంట బాగుంది లాభాలు వస్తాయి' అనుకుంటున్న సమయంలో కొవిడ్ వల్ల వచ్చిన దిగుబడిని అమ్ముకోలేక నష్టపోయామని రైతులు తెలిపారు. ఇప్పుడు కూరగాయల ధరలు కొంచెం ఫర్వాలేదు అనుకొంటుండగా.. అధిక వర్షపాతం వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి పందిళ్లు వేసి మరీ పండించిన.. బీర, సొర, కాకర, టమోటాలోనూ ఆశించినంత దిగుబడి రాలేదని వాపోయారు. సొరకాయ పిందె దశలో ఉండగా అధిక వర్షపాతం కురిసి.. కాయలు, పువ్వులు కుళ్లిపోయాయన్నారు. వేరు కుళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు, పండు ఈగ ఉద్ధృతి అధికమై పంట చెడి పోయిందన్నారు. పొలంలో నీరు నిలిచి టమోటా కుళ్లిపోయి.. భారీ నష్టం వాటిల్లిందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శాస్త్రవేత్తల సూచనలు..
రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలోని పందిరి పంటలను.. అనంతరాజుపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఈరోజు పరిశీలించారు. బీర, సొర, కాకర, టమోటాలతో పాటు మామిడి, అరటి, తమలపాకు తోటల సాగుదారులు.. అధిక వర్షపాతం సమయంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులపై రైతులతో చర్చించారు.
టమోటా సాగులో జాగ్రత్తలు..
అధిక వర్షపాతం సమయంలో టమోటా పంటలో అల్తానీరియా లీఫ్ లైట్ తెగులు ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఖరీఫ్ సీజన్, చలి కాలంలో ఆకుల మీద వలయాకార మచ్చలు ఏర్పడి మాడిపోతాయన్నారు. దాని నివారణకు రైతులు ప్రాథమిక దశలోనే చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తనాలు నాటే ముందు కేజీకి మూడు గ్రాములు క్రాఫ్టాన్ లేదా తైరాన్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలన్నారు. ఆకుమచ్చ తెగులు కనిపించిన వెంటనే.. లీటర్ నీటికి క్లోరో తలోనిల్ రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో నీటిని తోడేసి.. లీటర్ నీటికి బ్లీటాక్స్ మూడు గ్రాములు కలిపి మొదళ్లు తడిచే విధంగా పిచికారీచేస్తే.. బూజు తెగులు రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. లీటర్ నీటికి పది గ్రాములు చొప్పున నైట్రోజన్, పొటాష్ ఎరువులు కలిపి పిచికారీ చేస్తే.. పోషకాలు బాగా అంది మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయన్నారు.
అరటి, తమలపాకు తోటలకు..
అరటి, తమలపాకు తోటల్లోనూ అధిక వర్షపాతం వలన ఆకు మచ్చ తెగులు ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. లీటరు నీటికి పది గ్రాములు చొప్పున పొటాషియం నైట్రేట్‌ను కలిపి.. గెలలు, ఆకులపై పిచికారీ చేయాలని సలహా ఇచ్చారు. తమలపాకులో కుళ్లు తెగులు నివారణకు ఎలైట్ లేదా రిడూమిల్ అనే మందును లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి మొక్క మొదళ్లలో పోయాలన్నారు.
కూరగాయ పంటల్లో తెగుళ్ల నివారణకు..
అధిక వర్షపాతం వల్ల కూరగాయ పంటలకు వేరు కుళ్లు తెగులు, ఆకు మచ్చ తెగుళ్లు ఎక్కువగా వస్తుంటాయని అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నాగలక్ష్మి తెలిపారు. ఈ దశలో లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున క్లోరోథలోనిల్ కవచ్ కలిపి పిచికారి చేస్తే వాటి ఉద్ధృతి తగ్గించవచ్చని వెల్లడంచారు. 6 మి.లీ ఇథనాల్, 4 మి.లీ మిథైల్ యూజనల్, 2 మి.లీ మాలతిన్ను కలిపిన ద్రావణం చెక్కలను ముంచి.. చిన్న డబ్బాలలో ఉంచితే మగ ఈగలను ఆకర్షించి తద్వారా పండు ఈగ ఉద్ధృతి తగ్గుతుందన్నారు. రైతులు ఈ యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే అధిక వర్షపాత సమయంలో కొంతవరకు తెగుళ్లను నివారించవచ్చన్నారు.
ఇదీ చదవండి: