Watchman Ranganna: వివేక హత్య కేసులో సాక్షులను కాపాడుకోవడానికి సీబీఐకి తలప్రాణం తోకకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హత్య కేసులో కీలక సాక్షులు, నిందితులు కనుమరుగవడమో లేదా.. సీబీఐకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడం చేయడంతోనో.. అప్పటి వరకు జరిగిన దర్యాప్తు మళ్లీ మెుదటికి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేపథ్యంలో వివేకా హత్య జరిగిన సమయంలో వాచ్మెన్గా పని చేసిన రంగన్నను సీబీఐ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈనెల రెండవ తేదీన అనారోగ్యం పాలైన రంగన్నను ఆసుపత్రిలో చేర్పించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత అధికారులు నేడు ఇంటికి తీసుకువచ్చారు.
తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న ఐదు రోజుల వైద్య చికిత్సలు అనంతరం తిరిగి పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకున్నాడు. ఆస్తమాతో బాధపడుతున్న వాచ్మెన్ రంగన్నను ఈనెల రెండవ తేదీ పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి పులివెందుల నుంచి తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. నాల్గో తేదీ తిరుపతి నుంచి డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోలుకున్నాడని వైద్యులు ధ్రువీకరించడంతో ఇవాళ తిరిగి పులివెందులకు రంగన్నను తీసుకొచ్చారు. ఈ ఐదు రోజులపాటు రంగన్న వెంట కేవలం భద్రతా సిబ్బంది మాత్రమే ఉండటం విశేషం.
వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ: రంగన్నతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ఆసుపత్రికి రాలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని అప్పట్లో సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని గతంలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సీఆర్పీసి 164 కింద రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో.. భాగంగా సీబీఐ రంగన్నను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. ఈ ప్రత్యక్ష సాక్షిని కాపాడుకోవడానికి సీబీఐ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం రంగన్నకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు.
అసలు ఎవరు ఈ రంగన్న: కర్నూలు జిల్లా కాశీపురానికి చెందిన రంగన్న.. తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పని చేశారు. 2017 నుంచి వివేకా ఇంటికి... కాపలాదారుగా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే కాపలాగా ఉన్నారు. వివేకా బతికి ఉండగా చివరిసారి, రక్తపు మడుగులో ఉన్నాక మొదటిసారి చూసిందీ రంగన్నే. వివేకా కుమార్తె సునీత సైతం అనుమానితుల జాబితాలో... రంగన్న పేరును హైకోర్టుకు సమర్పించారు. రంగన్నకు హత్య విషయాలు తెలిసే అవకాశం ఉందని, అవి బయటపెడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పకపోవచ్చని అప్పట్లో సునీత కోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఇవీ చదవండి: