కడప జిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన కర్నూలు - కడప కాలువకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. కర్నూలు కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నది నుంచి నీటిని మళ్లించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సాగు కోసం నీటి విడుదలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేశారు.
మరో రెండు మూడు రోజుల్లో కేసీ కాలువకు నీరు మళ్ళించే రాజోలి వద్దకు నీరు చేరుకోనుంది. ఈలోగా కుందునదిలో ప్రవహిస్తున్న వరద నీటిని కాలువలకు మళ్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజోలి వద్ద రెండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు కేసీ కాలువ డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు. వరి నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా కుందునదిలోని వరద నీటిని కాలువలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈలోగా పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీరు ఆనకట్ట చేరుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి:
Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల